
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జన నాయగన్’ (Jana Nayagan) బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రీసేల్‌లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. దీంతో వరుసగా మూడు సినిమాలకు ప్రీసేల్ బుకింగ్స్‌లోనే వన్ మిలియన్ మార్క్ అందుకున్న తొలి భారతీయ హీరోగా విజయ్ నిలిచారు. గతంలో విజయ్ నటించిన ‘వారిసు’, ‘ది గోట్’ చిత్రాలు కూడా విడుదలకు ముందే 10 లక్షలకు పైగా టికెట్ల విక్రయాలతో ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు ‘జన నాయగన్’తో విజయ్ (Vijay) హ్యాట్రిక్ కొట్టారు.
‘జన నాయగన్’ కథంటేంటే..
దళపతి వెట్రి కొండాన్ (విజయ్) ఓ ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ వ్యాపారవేత్తని అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదురించి నిజాయతీ కలిగిన జైలు అధికారి (గౌతమ్ మేనన్) దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ అధికారి సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్ష కింద బయటకొస్తాడు వెట్రి. అంతలోనే ఆ అధికారి ఓ ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అతడి కుమార్తె విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతని వెట్రి తన భుజాన వేసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యని కళ్లారా చూసిన విజ్జి ప్రతి చిన్న విషయానికీ భయంతో వణికిపోతుంటుంది. ఆమెను ధైర్యవంతురాలిగా మార్చి, సైన్యంలో చేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని లక్ష్యంగా చేసుకుని ఆమెని అంతం చేయాలని తన ముఠాని పంపుతాడు. ఇంతకీ విజ్జిని జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేమిటి?అనేది కథ.


