
WagonR flex fuel | ఇంటర్నెట్ డెస్క్: చమురు దిగుమతులు తగ్గించి, ఇథనాల్ వినియోగాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను రూపొందిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (జూన్ 5) పురస్కరించుకుని హీరో మోటోకార్ప్ రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లను బుధవారం లాంచ్ చేయగా.. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తొలి ఫ్లెక్స్‌ప్యూయల్ కారు వ్యాగనార్ (WagonR)ను పరిచయం చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్‌దీప్ సింగ్ పురి ఈ కారును గురువారం ఆవిష్కరించారు.
భారతదేశ ఇంధనరంగంలో సరికొత్త అధ్యాయం మొదలైందని మారుతీ సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషీ టకేయుచి ఈసందర్భంగా పేర్కొన్నారు. క్రూడాయిల్ దిగుమతులు తగ్గించుకోవడం, కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడం భారత్ ముందున్న రెండు ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఈ రెండూ ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో సాకారం అవుతాయన్నారు. బయో ఫ్యూయల్, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లేలా ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఫ్లెక్స్‌ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల ఆటోమొబైల్‌కు మాత్రమే కాకుండా రైతులకు, ఇథనాల్ ఉత్పత్తిదారులకూ మేలు చేకూరుతుందన్నారు. ఇందులోభాగంగా మారుతీ సుజుకీ ఆ దిశగా కీలక ముందడుగు వేసిందన్నారు.
ఇక ఈ కారు విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు సాధారణ పెట్రోల్‌తో పాటు 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండ్ చేసిన E85 ఫ్యూయల్‌తోనూ నడుస్తుంది. డిజైన్ పరంగా E20 మోడల్‌ను పోలి ఉంది. ధర, ఇతర వివరాలు వెల్లడించలేదు. అయితే, రూ.8.50 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్ చేసిన నేపథ్యంలో మారుతీ సుజుకీ కంపెనీ షేర్లు రాణించాయి. ఓ దశలో 1.5 శాతం లాభంతో షేరు విలువ రూ.13,250కి పెరిగాయి. మధ్యాహ్నం 12.50 గంటల సమయానికి దాదాపు ఒక శాతం లాభంతో రూ.13,152 వద్ద ట్రేడవుతోంది.


