Shambhala Movie Review: రివ్యూ: శంబాల.. ఆది సాయికుమార్‌ ఖాతాలో హిట్‌ పడిందా?


Shambhala Movie Review || చిత్రం: శంబాల; నటీనటులు: ఆది సాయికుమార్‌, అర్చనా అయ్యర్‌, శ్వాసిక విజయ్‌, మధునందన్‌, హర్షవర్థన్‌, రవి వర్మ, శివ కార్తిక్‌ తదితరులు; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌; ఎడిటర్‌: శర్వణ్‌; దర్శకత్వం: యుగంధర్‌ ముని; విడుదల: 25-12-2025

ఈ క్రిస్మస్‌కు బ‌ల‌మైన ప్ర‌చారంతో విడుద‌ల‌కు ముందే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన సినిమా… ‘శంబాల‌’. ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. మ‌రి శంబాల ఎలా ఉంది?ఈ సినిమాతో ఆది సాయికుమార్‌కి విజ‌యం ద‌క్కిన‌ట్టేనా?

క‌థేంటంటే..

Shambhala Movie Story || 1980 ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. వెయ్యేళ్ల చ‌రిత్ర ఉన్న ఓ ఊరు శంబాల. అక్క‌డ ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. అప్ప‌ట్నుంచి ఊరిలో అనూహ్యమైన సంఘ‌ట‌న‌లు జ‌రగ‌డం మొద‌ల‌వుతాయి. ఉన్న‌ట్టుండి ఎవ‌రో ఒక‌రు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ హ‌త్య‌లు చేస్తారు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పూనుకుంటుంటారు. దాంతో బండ భూతం ఆవ‌హించిందంటూ ఊరి జ‌నం భ‌యంతో వ‌ణికిపోతుంటారు. మూఢ న‌మ్మ‌కాలు రాజ్య‌మేలుతాయి. ఆ రహస్యాలను ఛేదించేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయి కుమార్) అనే యువ శాస్త్ర‌వేత్త‌ని ఆ గ్రామానికి పంపిస్తుంది. సైన్స్‌నే న‌మ్ముకుని విధులు నిర్వ‌ర్తించే విక్రమ్ ఆ ఊళ్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల వెన‌క ర‌హ‌స్యాల్ని ఛేదించాడా?లేదా?ఆ ఊరిలో క‌నిపించిన దేవి (అర్చ‌న అయ్య‌ర్‌) ఎవ‌రు?విక్ర‌మ్ న‌మ్ముకున్న సైన్స్‌కీ, ఊరి చ‌రిత్ర వెన‌కున్న శాస్త్రానికి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఎలా సాగిందో  తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే..

Shambhala Movie Review Telugu || మిస్టిక్ థ్రిల్ల‌ర్‌… కొంత‌కాలంగా విశేషంగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన జానర్‌ ఇది. భ‌య‌పెట్టే అంశాలు, ఉత్కంఠ రేకెత్తించే ర‌హ‌స్య కోణం, పురాణ నేప‌థ్యం, దేవుళ్లు, ఆత్మ‌లు… ఇలా బోలెడ‌న్ని అంశాలు ఈ క‌థ‌ల్లో నిక్షిప్త‌మై ఉంటాయి. వీట‌న్నిటినీ ప‌క్కాగా మేళ‌వించి తెర‌పైకి తీసుకొస్తే చాలు… విజ‌యం ఖాయం. ఆ విష‌యం ఈ సినిమాతో  మ‌రోసారి రుజువైంది. ప్రేక్ష‌కుడిని ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌డం ఈ క‌థ‌ల ప్ర‌త్యేక‌త‌. సినిమా ఆరంభ‌మైన కొన్ని నిమిషాల్లోనే ద‌ర్శ‌కుడు శంబాల ప్ర‌పంచంలో లీనం చేసేస్తాడు. ఊరు, దాని వెన‌క చ‌రిత్ర, మూఢ న‌మ్మ‌కాలు,  క‌థానాయ‌కుడి రంగ ప్ర‌వేశం… ఇలా స‌న్నివేశాల‌న్నీ ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. ఊరి జ‌నాల్లోకి బండ‌భూతం ఆవ‌హించిన త‌ర్వాత క‌థ‌లో అస‌లు సిస‌లు ఉత్కంఠ, హార‌ర్ కోణం మొద‌ల‌వుతుంది. ర‌వివ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రుల పాత్ర‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు సినిమాని మ‌రోస్థాయికి తీసుకెళ‌తాయి. చెర‌కు తోట‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు భ‌య‌పెడ‌తాయి. అయితే ఆ ఎపిసోడ్‌లో క‌ళ్ల‌ముందే అంతా జ‌రిగిపోతున్నా క‌థానాయ‌కుడి నుంచి పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న క‌నిపించ‌దు. అదంతా క‌థ‌ని ముందుకు న‌డిపించడానికి ద‌ర్శ‌కుడు స్వేచ్ఛని తీసుకుని స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు అనిపిస్తుంది.

విరామానికి ముందు నుంచి సినిమాలో ఉత్కంఠ‌ని మ‌రింత‌గా పెంచుతూ, ప్రేక్ష‌కుడి మ‌దిలో బోలెడ‌న్ని ప్ర‌శ్న‌ల్ని రేకెత్తించాడు. వాట‌న్నిటికీ స‌మాధానాలు ద్వితీయార్ధంలో దొరుకుతాయి. ఊరి దేవ‌త చ‌రిత్ర‌, ఉల్క ప‌డ‌టంతో జ‌రిగిన ప‌రిణామం, అరిష‌డ్వ‌ర్గాల కోణం… ఇలా అస‌లు క‌థంతా ద్వితీయార్ధంలోనే బ‌య‌టికొస్తుంది. ఆ స‌న్నివేశాల‌న్నిటినీ ప‌క్కాగా రాసుకుని, అంతే ప‌క‌డ్బందీగా తెర‌పైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. ద్వితీయార్ధంలోనూ బండ‌భూతం మ‌రికొంద‌రిని ఆవ‌హించ‌డం, వాళ్ల‌ని ప్ర‌తిఘ‌టిస్తూ క‌థానాయ‌కుడు చేసే పోరాటం ఉత్కంఠ‌ని రేకెత్తిస్తుంది. ఒక ద‌శ‌లో జాంబీ సినిమాలు గుర్తుకొస్తాయి. చిన్నారితో ప‌తాక స‌న్నివేశాల్ని ముడిపెట్ట‌డంతో భావోద్వేగాలూ పండుతాయి. క‌థానాయ‌కుడు అస‌లు స‌మ‌స్య‌కు ఎలా ప‌రిష్కారం క‌నుక్కుంటాడ‌నే ఉత్కంఠ చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగుతుంది. 

ఎవ‌రెలా చేశారంటే..

Shambhala Movie Cast || బ‌ల‌మైన పాత్ర‌ల‌తో రూపుదిద్దుకున్న క‌థ ఇది. క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్ (aadi saikumar) చాలా రోజుల త‌ర్వాత ఒక  గాఢ‌మైన పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు. ఇందులో ఆయ‌న ఆహార్యం, స‌హ‌జ‌మైన న‌ట‌న పాత్ర‌కి మ‌రింత బలాన్నిచ్చింది.  యాక్ష‌న్ స‌న్నివేశాలతోనూ మెప్పించారు. అర్చ‌న అయ్య‌ర్ (Archana Iyer) ఎవ‌రూ ఊహించ‌ని పాత్ర‌లో క‌నిపిస్తుంది. నాయ‌కానాయిక‌లే కాదు… ర‌వివ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ మొద‌లుకొని ఇంద్ర‌నీల్‌, మ‌ధునంద‌న్‌,  శైల‌జ ప్రియ‌, శ్రావ‌ణ సంధ్య‌,  శ్వాసిక విజ‌య్,బేబి ఛైత్ర, శివ‌కార్తిక్ త‌దిత‌రులు  పోషించిన పాత్ర‌లు కూడా సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావమే చూపిస్తాయి.

సాంకేతిక బృందం ఈ సినిమాకి వెన్నెముక‌. శ్రీచ‌ర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం చాలా చోట్ల ప్రేక్ష‌కుల్లో భ‌యాన్ని పుట్టించింది. ప్ర‌వీణ్ కె.బంగారి విజువ‌ల్స్ శంబాల ప్ర‌పంచాన్ని ఎంతో స‌హ‌జంగా ఆవిష్క‌రించింది. రాత్రి వేళ‌ల్లోనే ఎక్కువ‌గా స‌న్నివేశాలు సాగుతాయి. వాటిని త‌న కెమెరాలో ప్ర‌భావ‌వంతంగా  బంధించారు. ద‌ర్శ‌కుడు యుగంధ‌ర్ ముని ర‌చ‌నలో అక్క‌డ‌క్క‌డా లోటుపాట్లు క‌నిపించినా, మేకింగ్ ప‌రంగా మాత్రం ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.  

  • బ‌లాలు
  • + క‌థాంశం, ఉత్కంఠతో సాగే క‌థ‌నం
  • న‌టీన‌టులు
  • సంగీతం… విజువ‌ల్స్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • ప‌తాక స‌న్నివేశాలు
  • చివ‌రిగా:  శంబాల‌…  థ్రిల్‌ని పంచే ఓ  కొత్త  ప్ర‌పంచం (shambhala movie review telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



Source link

Scroll to Top