
హైదరాబాద్: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్ కేసీఆర్‌కు ఉందో? లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు.
‘‘సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానికి 67.5ఎకరాలు ఉంది. కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు, జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్రావుకు 48 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాలున్నాయి. కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్‌పై నేనెందుకు బాంబులు వేస్తా? ఆయనేమైనా బిన్లాడెనా.. రోడ్డు మీద పిచ్చికుక్క కూడా కరవదు. స్టీఫెన్సన్కు ఎన్నికల ముందు నజరానా ఇచ్చారు. రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్ చేశారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి 650 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారు. జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చింది. పైలట్ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. ఒక కుటుంబానికి కుష్కి పొలం 54, తరి పొలమైతే 27 ఎకరాలుండాలి. కానీ, కేసీఆర్‌కు ఉన్నది మొత్తం తరి పొలమే’’ అని సీఎం వివరించారు.
కొందరు కొల్లగొట్టిన వేల ఎకరాల వివరాలు సభ ముందుంచుతా: సీఎం రేవంత్‌రెడ్డి
త్వరలోనే ధరణి పార్ట్-2 అక్రమాలు బయట పెడతాం..
‘‘రాష్ట్రంలో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగింది. భూ కుంభకోణంపై స్పెషల్ ఎంక్వయిరీ టీమ్ (ఎస్ఈటీ) ఏర్పాటు చేస్తాం. మొత్తం భూ కుంభకోణంపై నెల రోజుల్లో నిగ్గు తేలుస్తాం. ఇప్పటి వరకు చెప్పింది ధరణి పార్ట్-1 మాత్రమే. త్వరలోనే ధరణి పార్ట్-2 అక్రమాలు బయటపెడతాం. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉన్నప్పుడే అన్నీ బయటపెడతాం. ఈ సారి సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు వచ్చేలా స్పీకర్ చూడాలి. నా కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం వాళ్లకు ఉండదు. టీజీఐఐసీ భూముల్లో జరిగిన అక్రమాలను బడ్జెట్ సెషన్లో బయటపెడతా. ధరణిని అడ్డు పెట్టుకొని రూ.వేల కోట్లు దోచుకున్నారు. 22ఏ సమస్యల పరిష్కారానికి హైపవర్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేస్తాం. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్ తీసుకొస్తాం. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ లేఔట్ల దరఖాస్తులు పరిశీలిస్తాం. పెండింగ్‌లో ఉన్న, కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారానికి వారంలోపు వ్యవస్థ తీసుకొస్తాం’’ అని సీఎం అన్నారు. మరోవైపు ఎల్బీనగర్లో జీవో 118 పరిధిలో ఉన్నవారందరికీ త్వరలో శుభవార్త చెబుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. జీవో 118 కింద పెండింగ్ దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో 9,500 మంది బాధితులు ఉన్నారని పేర్కొన్నారు.


