
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనున్నాయి. మే 26న జరగనున్న ఈ మ్యాచ్‌కు ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఇందులో గెలిస్తే నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లొచ్చు. దీంతో ఈ మ్యాచ్‌తోనే టైటిల్ పోరుకు అర్హత సాధించాలని ఇరుజట్లు తమ ప్రణాళికలకు పదునుపెట్టాయి. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సైమన్ డౌల్ ఓ సూచన చేశాడు. గాయం నుంచి కోలుకుని అందుబాటులోకి వచ్చిన ఫిల్ సాల్ట్‌ను క్వాలిఫయర్-1లో ఓపెనర్‌గా ఆడించొద్దని అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. దీంతో క్వాలిఫయర్-1లోనూ అతడినే ఓపెనర్‌గానే ఆడించాలని సైమన్ డౌల్ సూచించాడు.
‘‘విరాట్ కోహ్లీకితోపాటు ఓపెనర్‌గా నేను వెంకటేశ్ అయ్యర్‌నే ఎంచుకుంటాను. ఫిల్ సాల్ట్ మూడున్నర వారాలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యంగా వేలి గాయం నుంచి కోలుకుని తిరిగి మ్యాచ్ ఆడటం అంత సులభం కాదు. సాల్ట్ నాణ్యమైన ఆటగాడు. ఆర్సీబీ, ఇంగ్లాండ్ తరఫున టీ20లలో బాగా ఆడాడు. కానీ, మ్యాచ్ ఫిట్నెస్, షాట్-టైమింగ్ తిరిగి పొందడానికి సమయం పడుతుంది. దానిని పరీక్షించుకోవడానికి ప్లే ఆఫ్స్ సరైన వేదిక కాదు. విరాట్‌తో సాల్ట్‌కు బలమైన భాగస్వామ్య రికార్డు ఉంది. కానీ, క్రికెట్లో ఎప్పుడూ ఫామ్‌లో ఉన్న ఆటగాడినే ఎంచుకోవాలి. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లలో, పేరుప్రతిష్ఠల కన్నా ఫామ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని వారాలుగా పోటీ క్రికెట్ ఆడని ప్లేయర్‌ని జట్టులోకి తీసుకోవడమే అతిపెద్ద రిస్క్. నేనైతే ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్‌కే మద్దతు ఇస్తాను’’ అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు. సీజన్ చివర్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వెంకటేశ్ అయ్యర్ సత్తాచాటాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 40 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు.


