
RBI Governor | ఇంటర్నెట్డెస్క్: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశంపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే అందుకు అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని పేర్కొన్నారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. యూపీఐ ఛార్జీల అంశంపై స్పందించారు. దీనిపై అప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందన్న ఆయన.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు.
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్’లో సవరణలు ప్రతిపాదించారు. ఛార్జీల వివరాలూ ఇంకా ఖరారు కానప్పటికీ, ఈ సవరణ ద్వారా యూపీఐ వంటి చెల్లింపులపై ఎండీఆర్ విధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఏ డిజిటల్ చెల్లింపు లావాదేవీలకు ఎండీఆర్ మినహాయింపు ఇవ్వాలనేది ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రూ.2వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్ రేటు 0.3% నుంచి 0.5% వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఛార్జీలు పెద్ద వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయి. లావాదేవీలను ప్రాసెస్ చేసినందుకు గాను వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఛార్జీలను బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు భరిస్తున్నాయి. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు వర్తించవు.
వచ్చే ఏడాది పాలిమర్ కరెన్సీ
దీర్ఘకాలం మన్నిక ఇచ్చే పాలిమర్ కరెన్సీ నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి తీసుకురావాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య విధాన సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కొన్ని చోట్ల పాలిమర్ కరెన్సీ నోట్లు 30 ఏళ్లకు పైగా మన్నికగా నిలిచాయని చెప్పారు. ముఖ్యంగా ఎక్కువగా చలామణీ అయ్యే తక్కువ విలువ కలిగిన నోట్లకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.


