భారత సంతతి దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవీ పిళ్లైకి దక్కిన శాంతి పురస్కారం
ఆమె శాంతి కోసం ఎన్నడూ కృషి చేయలేదంటూ ట్రంప్ అక్కసు

అంతర్జాతీయ నాయకులారా.. యుద్ధాలకు దూరంగా ఉంటూ.. మానవ హక్కులను పరిరక్షించాలి. అది మీ చట్టపరమైన బాధ్యత.
నవీ పిళ్లై
ఓస్లో: జాతి వివక్షపై అలుపెరుగని పోరాటం చేస్తూ.. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం నవీ పిళ్లై కీర్తి కిరీటంలో నోబెల్ చేరింది. అంతర్జాతీయ శాంతి, సమానత్వ చట్టాల కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. నవీ పిళ్లై భారత సంతతి మహిళ కావడం విశేషం. ఆమె పూర్వీకులు తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. 85 ఏళ్ల నవీ పిళ్లై గతంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా, అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిగా, దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్‌లో జడ్జిగా పని చేశారు. చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. గాజాలో ఇజ్రాయెల్ దురాగతాలపై స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్‌కు పిళ్లై నేతృత్వం వహించారు. మరెన్నో ఇతర కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సామూహిక హత్యాకాండలు, లైంగిక హింసపై అంతర్జాతీయ చట్టాల రూపకల్పనలో ఈమెది విశేష కృషి. పిళ్లైని సమకాలీన అత్యంత గౌరవనీయ న్యాయవేత్తల్లో ఒకరిగా నోబెల్ కమిటీ పేర్కొంది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల పట్ల ఆమె నిబద్ధతను ప్రశంసించింది.
ట్రంప్‌తో పంచుకుంటానంటూ నవీ పిళ్లై ఛలోక్తి!
నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకున్నట్లు ప్రకటన వెలువడిన తర్వాత జర్మనీలో ఓ కార్యక్రమంలో పిళ్లై స్పందిస్తూ.. ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులు తీవ్రమైన రాజకీయ దాడిని ఎదుర్కొంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాట పడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు ఈసారీ భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో నవీ పిళ్లై చేసిన వ్యాఖ్య నవ్వులు పూయించింది. నోబెల్ గెల్చుకున్నందుకు సభికులంతా చప్పట్లోతో తనను అభినందిస్తుండగా.. ‘‘మీరు ఇంకాస్త ఎక్కువగా చప్పట్లు కొడితే.. నేను ట్రంప్‌తో ఈ బహుమతి పంచుకుంటానేమో’’ అంటూ పిళ్లై ఛలోక్తి విసిరారు. నిరుడు నోబెల్ శాంతి పురస్కారాన్ని దక్కించుకున్న వెనెజువెలా నాయకురాలు మరియా కొరీనా మచాడో.. ట్రంప్‌తో ఆ బహుమతిని పంచుకుంటానని ప్రకటించిన సంగతి గమనార్హం.
- ట్రంప్‌ను తమ దేశం నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిందని.. ఈసారి ఆయనకే అది దక్కుతుందని ఆశిస్తున్నామని పురస్కార ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
- నోబెల్ గెల్చుకున్న నవీ పిళ్లైకి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోకర్ టర్క్ తదితరులు వివిధ మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేశారు.
- నోబెల్ శాంతి బహుమతి ఇప్పటివరకూ ఇద్దరు భారతీయులకు దక్కింది. 1979లో మదర్ థెరిసాను, 2014లో కైలాష్ సత్యార్థిని అది వరించింది.
- నవీ పిళ్లైకి కైలాష్ సత్యార్థి శుభాకాంక్షలు తెలిపారు. మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం కోసం ఆమె అలుపెరుగని పోరాటం చేశారంటూ ప్రశంసించారు.
ట్రంప్ అక్కసు
నవీ పిళ్లైపై ట్రంప్ తీవ్ర అక్కసు వెళ్లగక్కారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను అసహ్యించుకునే వ్యక్తిగా ఆమెను పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పెట్టిన పోస్టును ఆయన రీపోస్టు చేశారు. శాంతి కోసం పిళ్లై ఎన్నడూ కృషి చేయలేదని.. అలాంటి వ్యక్తిని నోబెల్‌కు ఎంపిక చేయడం పురస్కార కమిటీకి సిగ్గుచేటని ఆ పోస్టులో ఉండటం గమనార్హం.


