
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు, ఆరుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి లోకేశ్ (Nara Lokesh)అన్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఘటన జరిగిన వెంటనే కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి పరిశీలించారు. కార్మికులకు భరోసా కల్పించాలన్నదే మా అందరి ఉద్దేశం. కేంద్రమంత్రి కుమారస్వామి అదనంగా రూ.25లక్షల చొప్పున ప్రకటించారు. మరణించిన వారిలో శాశ్వత, ఒప్పంద ఉద్యోగులెవరైనా మాకు సమానమే. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడేందుకు ఎన్డీయే అడుగేసింది. లోపం ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. నిపుణులు అన్ని విషయాలు పరిశీలిస్తారు. ఘటన జరిగిన వెంటనే అంతా అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే స్వయంగా కేంద్రమంత్రి కుమారస్వామి వచ్చారు. విశాఖ ఉక్కును కాపాడటమే కాదు.. ఉత్పత్తి కూడా తిరిగి ప్రారంభించాం. విశాఖ ఉక్కును మేమే కాపాడుకున్నాం.. ఇక ముందూ అలాగే ఉంటాం’’ అని లోకేశ్ స్పష్టం చేశారు.



