
ఇంటర్నెట్ డెస్క్: తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు ఆయన ఇటీవల ఐక్య సంస్థను (AIKYA Dhairya Sena Samithi) ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్న పలు సందేహాలపై ఆయన స్పష్టతనిచ్చారు.
మే 20న తన పుట్టినరోజు సందర్భంగా నేడు మీడియాతో మనోజ్ (Manchu Manoj) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐక్య గురించి మాట్లాడారు. ఇది రాజకీయ సంస్థ కాదన్నారు. రాజకీయాలకు ఈ సంస్థకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజల గొంతుకగా ఉండేందుకు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దీని కార్యకలాపాల కోసం సొంత నిధులనే వెచ్చించనున్నట్లు తెలిపారు. అలాగే, తన సతీమణి మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యామని స్పష్టం చేశారు.
మీ నాన్నతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా? అని అడగ్గా.. ‘అది ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ, మైక్‌తో వెళ్లకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి’ అని సరదాగా చెప్పారు.


