
ఇంటర్నెట్ డెస్క్: రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో రానున్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ ఎప్పుడు పంచుకుంటారా అని ఆసక్తిగా ఉన్నారు. కొంచెం విరామం దొరికినా విదేశాలకు వెళ్లే మహేశ్ ఇటీవల జర్మనీ వెళ్లడంతో పర్సనల్ టూర్ అని అందరూ భావించారు. కానీ, వారణాసి ట్రైనింగ్‌లో భాగంగా వెళ్లినట్లు మహేశ్ (Mahesh Babu) పంచుకున్న ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం మహేశ్ బాబు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ (The Black Forest)లో ఉన్నారు. అక్కడ ఆయన ఫిట్‌నెస్, వెల్‌నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహేశ్ స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం సిద్ధమవుతున్నట్లు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
గ్లోబల్ ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాజమౌళి (SS Rajamouli) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘వారణాసి’ సినిమాతో మరిన్ని కొత్త మార్కెట్లనీ కొల్లగొట్టాలనే ప్రణాళికల్ని చిత్రబృందం సిద్ధం చేసింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాతోపాటు, లాటిన్ అమెరికా దేశాల మార్కెట్‌పైన గురిపెట్టినట్టు తెలుస్తోంది. ‘వారణాసి’ కథ కూడా పలు దేశాలతో ముడిపడినది కావడం, కథానాయకుడు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కావడంతో… మరిన్ని కొత్త దేశాలకు, కొత్త మార్కెట్లకీ ఈ సినిమాని తీసుకెళ్లాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.


