ICC Mens T20 World Cup: కూనలే అనుకుంటే.. ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న చిన్న జట్లు


టీ20 ప్రపంచకప్‌లో (ICC Mens T20 World Cup) మొత్తంగా 20 జట్లు.. అందులో అసోసియేట్‌ దేశాలే పది.. ఆ జట్లు ఏమాత్రం పోటీ ఇస్తాయి? గ్రూప్‌ దశలో ఏం మజానిస్తాయి? అని సందేహించే ఉంటారు క్రికెట్‌ అభిమానులు. కానీ బలహీనం అనుకున్న జట్లు సత్తా చాటుతున్నాయి. ఏకపక్షం అనుకున్న మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. చిన్న జట్లు ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాయి కానీ.. విజయానికి, ఓటమికి మధ్య ఉన్న చిన్న గీతను మాత్రం దాటలేక పరాజయం పాలవుతున్నాయి. 

అనుభవలేమితో ఆఖర్లో తడబడి..

ఈ సారి కొన్ని కారణాల వల్ల టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతుంటే పెద్దగా సందడి కనిపించలేదు. కానీ టోర్నీలో తొలి నాలుగైదు రోజుల్లో మ్యాచ్‌లు సాగిన తీరు చూశాక క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి పెరిగి ఉంటుంది. తొలి రెండు రోజుల్లో ఆరు మ్యాచ్‌లు జరగ్గా.. ఒక వైపు.. అన్నీ పెద్ద జట్లుంటే.. ఇంకో దిక్కు చిన్న జట్లే నిలిచాయి. జట్ల మధ్య అంతరాన్ని బట్టి చూస్తే మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగి ఉండాలి. కానీ ఒక్కటంటే ఒక్కటీ అలా జరగలేదు. ఏ చిన్న జట్టూ అంత తేలిగ్గా ఓటమి అంగీకరించలేదు. బడా జట్లకు గట్టి పోటీనిచ్చాయి. కొన్ని జట్లు ప్రత్యర్థులకు ఓటమి భయాన్ని కలిగించాయి. విజయానికి చాలా దగ్గరగా వెళ్లాయి. కానీ అనుభవ లేమి వల్ల ఆఖర్లో తడబడి గెలుపు గీతను దాటలేకపోయాయి. 

తొలి మ్యాచ్‌లోనే..

టోర్నీ తొలి మ్యాచ్‌లోనే పెద్ద సంచలనం నమోదు కావాల్సింది. నెదర్లాండ్స్‌తో 148 పరుగుల ఛేదనలో ఒక దశలో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌.. ఓటమి బాటలో సాగింది. 2 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు గెలవడం కష్టమే అనిపించింది. కానీ వాన్‌బీక్‌ 19వ ఓవర్లో తడబడడంతో మ్యాచ్‌ పాక్‌ వైపు మొగ్గింది. ఈ ఓవర్లో ఫహీమ్‌ అష్రాఫ్‌ 3 సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను పాక్‌ వైపు తిప్పాడు. ఈ ఒక్క ఓవర్‌ కొంచెం కట్టుదిట్టంగా వేసి ఉంటే పాక్‌కు పెద్ద షాక్‌ తగిలేది. 

ఆఖరి ఓవర్లలో..

అదే రోజు వెస్టిండీస్‌కు స్కాట్లాండ్‌ గట్టి పోటీనే ఇచ్చింది. 183 పరుగుల ఛేదనలో 133/5తో లక్ష్యం దిశగా సాగింది. కానీ ఆఖరి ఓవర్లలో తడబాటుతో ఓటమి పాలైంది. శనివారం రాత్రి భారత జట్టుకు అమెరికా ఎలా ముచ్చెమటలు పట్టించిందో తెలిసిందే. అమెరికాతో రికార్డుల మోతే అనుకుంటే.. భారత్‌ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో ఇండియా ఈ మ్యాచ్‌ గెలుస్తుందన్న ఆశలే లేవు. 130 స్కోరు కూడా కష్టంగా కనిపించిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ మెరుపుల పుణ్యమా అని జట్టు 161 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లోనూ అమెరికా పోరాడినా.. భారత బౌలర్లు అవకాశమివ్వలేదు. 

టోర్నీకే హైలెట్‌..

అలాగే ఇంగ్లాండ్‌- నేపాల్‌ మ్యాచ్‌ టోర్నీలోనే హైలైట్‌గా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎదుట 185 పరుగుల భారీ లక్ష్యం నిలిచినా.. బెదరకుండా ఛేదనలో గొప్పగా పోరాడింది నేపాల్‌. ఇంగ్లిష్‌ బౌలర్లపై ఆ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేసి జట్టును విజయానికి అత్యంత చేరువగా తీసుకెళ్లారు. 19 ఓవర్లలో 175 పరుగులు చేసిన జట్టు.. చివరి ఓవర్లో 10 పరుగులు చేయలేదా అనిపించింది. కానీ సామ్‌ కరన్‌ అద్భుతమైన యార్కర్లు వేయడంతో అప్పటిదాకా చెలరేగిన లోకేష్‌ బామ్‌.. ధాటిగా ఆడలేకపోయాడు. అనుభవ లేమి, ఒత్తిడి వల్ల సరైన షాట్లు ఆడలేకపోవడంతో నేపాల్‌ త్రుటిలో ఓటమి పాలైంది. 

ఐర్లాండ్ సైతం..

అఫ్గానిస్థాన్‌ను ఇప్పుడు పసికూన అనలేం కానీ.. న్యూజిలాండ్‌తో పోలిస్తే చిన్న జట్టే. అయినా ప్రత్యర్థికి 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి సవాలు విసిరింది అఫ్గాన్‌. ఛేదనలో 14 పరుగులకే 2 వికెట్లు తీసి విజయావకాశాలు కూడా సృష్టించుకుంది. కానీ టిమ్‌ సీఫర్ట్, గ్లెన్‌ ఫిలిఫ్స్‌ను అడ్డుకోలేకపోవడంతో ఓటమి తప్పలేదు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ సైతం విజయానికి దగ్గరగా వెళ్లింది. కానీ ఆఖర్లో తడబడి పరాజయం చవిచూసింది. ఇక అఫ్గాన్‌ తన రెండో మ్యాచ్‌లో.. దక్షిణాఫ్రికాకు ముచ్చెమటలు పట్టించింది. మ్యాచ్‌లో ఆ జట్టు ముందు 188 పరుగుల భారీ లక్ష్యం నిలిచినా.. బెదరలేదు. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టే గెలిచేలా కనిపించింది. కానీ ఆఖర్లో తడబడడంతో మ్యాచ్‌ టై అయింది. తొలి సూపర్‌ ఓవర్లో స్కోర్లు సమమవడంతో ఇంకో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. అందులో అఫ్గాన్‌ త్రుటిలో ఓడింది.

ఇలా టోర్నీలో చిన్న జట్ల ప్రదర్శన ఉత్తమంగానే సాగుతూ క్రికెట్‌ అభిమానులకు కిక్కిస్తోంది. టోర్నీ మీద ఆసక్తి పెంచుతోంది. ఇప్పటిదాకా మ్యాచ్‌లు జరిగిన తీరు చూశాక ఏ పెద్ద జట్టూ చిన్న జట్లను తేలిగ్గా తీసుకోదన్నది వాస్తవం.

– ఈనాడు క్రీడా విభాగం



Source link

Scroll to Top