
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో (RCB) జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీనిపై ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తమ జట్టు పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే జట్టు కూర్పు గురించి ప్రస్తావించాడు.
‘‘మేం త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. అలాగే బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. ఈ విషయాల్లో మేం మెరుగవ్వాల్సి ఉంది. గత రెండు, మూడు మ్యాచుల్లోనూ మేం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాం’’ అని హార్దిక్ పాండ్య వివరించాడు.
రాబోయే మ్యాచుల్లో తమ జట్టులో మార్పులు ఉండే అవకాశముందని హింట్ ఇచ్చాడు. ‘‘ప్రస్తుతం మేం చాలా ఎంపికలను విశ్లేషించాల్సి ఉంది. తర్వాత జరగబోయే మ్యాచుల్లో తప్పకుండా జట్టు కూర్పులో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. అలాగే పవర్‌ప్లేలో మరిన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. నిన్నటి మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ పోరాటం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. అతడు టీమ్‌కు అదనపు బలం’’ అని పాండ్య తెలిపాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ (71*; 31 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా సిక్స్‌లతో చెలరేగిపోయాడు. అతడు పోరాడినా ముంబయి ఇండియన్స్‌కు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 240 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి జట్టు 222 రన్స్‌కే పరిమితమైంది.


