Home Loan Interest Rates: ఆర్బీఐ ఇటీవల కీలక రెపో రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో హోం లోన్లు మరింత భారం అవుతాయి. అందుకే ఇక్కడ హోం లోన్లు తీసుకునే ముందు వడ్డీ రేట్లు సరిగా చూసుకోవాలి. వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉన్నా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఉదాహరణతో ఒక శాతం తక్కువ వడ్డీ రేటుకే లోన్ వస్తే ఎన్నేళ్లకు ఈఎంఐ ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

ఇప్పుడు మనం ఉదాహరణకు రూ. 40 లక్షల హోం లోన్, వడ్డీ రేట్లు, ఈఎంఐ లెక్కల గురించి తెలుసుకుందాం. రూ. 40 లక్షల హోం లోన్‌పై వడ్డీ రేటు 10 శాతం నుంచి ఒక శాతం తగ్గి 9 శాతానికి చేరితే, ఇక్కడ లోన్ కాల పరిమితిని బట్టి కనీసం రూ. 2.63 లక్షల నుంచి రూ. 10.50 లక్షల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ 10, 20, 30 ఏళ్ల కాల పరిమితుల్లో ఈఎంఐ ఎంత తగ్గుతుంది?, మొత్తం వడ్డీ ఎంత మిగులుతుందో చూద్దాం.
ఇల్లు కొనుగోలు చేయడానికి హోం లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లలో స్వల్ప మార్పు కూడా పెద్ద మొత్తంలో ఆదా కలిగించొచ్చు. ముఖ్యంగా రూ. 40 లక్షల లోన్‌పై వడ్డీ రేటు 10 శాతం నుంచి 9 శాతానికి తగ్గితే, నెలవారీగా ఈఎంఐ తగ్గడంతో పాటుగా మొత్తం రుణంపై చెల్లించే వడ్డీ కూడా గణనీయంగా తగ్గుతుంది. లోన్ పరిమితిని బట్టి చూస్తే, రూ. 40 లక్షల లోన్‌పై ఒక శాతం వడ్డీ రేటు తగ్గితే పదేళ్లలో రూ. 2.63 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ 10 శాతం వడ్డీకి నెలకు ఈఎంఐ రూ. 52,860 గా ఉంటే, 9 శాతం వడ్డీ రేటుతో ఈఎంఐ రూ. 50,670 కి తగ్గుతుంది. నెలకు రూ. 2190 ఈఎంఐ రూపంలో ఆదా చేసుకోవచ్చు. ఇలానే 20 ఏళ్ల కాల పరిమితికి రూ. 6.27 లక్షలు ఆదా అవుతుంది. 30 ఏళ్లలో రూ. 10.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
Read Also: ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ భారం.. రూ. 25 లక్షల హోం లోన్‌పై ఇప్పుడు ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే?
ఎక్కువ కాల పరిమితి ఉంటేనే ఎక్కువ ఆదా ఎందుకు?
వడ్డీ రేటు ఒక శాతం తగ్గినప్పుడు, లోన్ కాల పరిమితి ఎక్కువగా ఉన్న వారికి మొత్తం ఆదా అయ్యే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. 30 ఏళ్ల లోన్‌పైనే రూ. 10.50 లక్షల వరకు వడ్డీ ఆదా అవుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం లోన్ కొనసాగితే మొత్తం వడ్డీ భారం కూడా పెరుగుతుందని గమనించాలి. ఉదాహరణకు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 40 లక్షల లోన్‌కు పదేళ్లలో సుమారు రూ. 20.80 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అదే లోన్‌ను 30 ఏళ్ల పరిమితితో తీసుకుంటే వడ్డీ ఏకంగా రూ. 75 లక్షలకు చేరుతుంది. అందుకే ఇక్కడ తక్కువ ఈఎంఐ కోసం ఎక్కువ కాల పరిమితిని ఎంచుకునే కంటే ముందుగా, మొత్తం కాలానికి వడ్డీ ఎంత చెల్లించాల్సి వస్తుందనేది పరిశీలించాలి. ఇంకా లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లతో పాటు ఇతర ఖర్చుల్ని కూడా పోల్చుకోవడం ముఖ్యం. వీటిల్లో ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇదే సమయంలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, దానికి అనుగుణంగా ఫ్లోటింగ్ రేటుపై లోన్ తీసుకున్న వారికి కీలక అంశాల్ని గమనించాలి. అప్పుడు ఈఎంఐ తగ్గించుకోవచ్చు లేదా అదే ఈఎంఐ కొనసాగించే కాల పరిమితి తగ్గించుకోవచ్చు.



