
‘‘ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఓ అనుభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ కలిసి తీసుకున్న నిర్ణయమే… ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా. ఇద్దరు హీరోలు ఇలాంటి ఓ కథని స్వాగతించి సినిమా చేయడమన్నదే ఎంతో ప్రత్యేకమైన విషయం. మంచి కథలు కుదిరినప్పుడు ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి’’ అన్నారు అనిల్ రావిపూడి. వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ ఘన విజయాల్ని సొంతం చేసుకుంటున్న దర్శకుడీయన. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఆయన… ఈసారి చిరంజీవి, వెంకటేశ్‌ని కలిపి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా అనిల్ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.
‘‘ఇంటిల్లిపాదీ కలిసి చూసే వినోదం ఉన్న సినిమాలు సంక్రాంతి పండగకు వస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ‘సంక్రాంతికి వస్తున్నాం…’ ఇలా గతంలో వచ్చిన చాలా సినిమాలు దుమ్ము దులిపేశాయి. కథలు బాగున్న అన్ని సినిమాలూ ఆడతాయి. ఈ సంక్రాంతికి కూడా అన్నీ వినోద ప్రధానమైన సినిమాలే వస్తున్నాయి. అన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇక నా విషయానికొస్తే… ‘అనిల్ సంక్రాంతికి వచ్చి మంచి వినోదం పంచుతున్నాడు’ అనే గుర్తింపు చాలు. అంతేకానీ, నాపైన ప్రత్యేకంగా సంక్రాంతి ముద్ర వస్తే అది నాపైన ఒత్తిడిని పెంచుతుంది. మానవీయ సంబంధాలతో కూడిన కథలతో నేను తీస్తున్న సినిమాలు ప్రతి కుటుంబానికీ చేరువవుతున్నాయి. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాలోనూ హాస్యంతోపాటు, బలమైన భావోద్వేగాలూ ఉంటాయి’’.
- ‘‘ఒక కథని హీరో పాత్ర కోణంలో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి పాత్రలతో నేను సినిమా చేయలేదు. అదే నాకు కొత్తగా అనిపించింది. శంకరవరప్రసాద్ పాత్రకి కోపం వస్తే ఎలా ఉంటుంది? నవ్వు వస్తే ఎలా ఉంటుంది? ఆయా సందర్భాల్లో ఆ పాత్ర చేసే ప్రయాణం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్లు దాన్ని ఎలా స్వీకరించారు? ఎలా పరిష్కారమైందనే విషయాల్ని ఈ కథలో కొత్త కోణంలో చూపించాం. భార్యాభర్తలు, పిల్లల నేపథ్యంలో భావోద్వేగాల్ని తెరపై చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఇది నిజమే కదా అనే భావన కలుగుతుంది. చిరంజీవి సినిమాల్లోకి పునః ప్రవేశం చేసిన తర్వాత ‘అన్నయ్య’, ‘బావగారూ బాగున్నారా’, ‘చూడాలని ఉంది’ తరహా కుటుంబ కథల్ని ఆయన మళ్లీ చేయలేదు. ఘన విజయాల్ని అందించిన ఈ జానర్‌లోనే ఆయనతో సినిమా చేయాలని ఈ కథని రాసుకున్నా. ఈ ఆలోచన చెప్పగానే కథానాయకులు ఇద్దరికీ నచ్చింది. చిరంజీవి తెరపై చేసే అల్లరి, ఆయన ఇమేజ్‌కి తగ్గ మాస్ అంశాలు, ఆయన పంచే భావోద్వేగాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు టైమ్ మిషన్ ఎక్కి ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది’’.
- ‘‘సినిమాకి ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనే విషయాల్లో నిర్మాతల కంటే నేనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా. రోజూ సినిమా చిత్రీకరణకు అయిన వ్యయం నాకు వాట్సప్‌లో వస్తూ ఉంటుంది. నేనే ఓ నిర్మాతలా భావించి సినిమాలు చేస్తుంటా. నిర్మాత తన జీవితాన్ని పణంగా పెట్టి సినిమా చేస్తారు. లాభం మాట తర్వాత, సినిమా బయటకు వచ్చే సమయానికి పెట్టిన డబ్బు తిరిగొచ్చిందనే భరోసాతోనైనా ఉండాలి. అలాంటి ఆలోచనలతో సినిమాలు చేయడంతోనే నా నిర్మాతలంతా సంతోషంగా ఉన్నారు. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాకి భారీగా ప్రారంభ వసూళ్లు వస్తాయి. ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో సినిమాలు చేశా. మరో అగ్ర హీరో నాగార్జునతో సినిమా ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. ఆయనతో ఓ సినిమా చేయాలని నాకూ ఉంది. ఆ సినిమా చేస్తే నలుగురు అగ్ర హీరోలతో సినిమా చేసిన ఈతరం దర్శకుడిగా రికార్డ్ నాదే అవుతుంది. తదుపరి సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తా’’.
- ‘‘ఇద్దరు అగ్ర కథానాయకుల్ని ఒక కథలోకి తీసుకు రావడమనేది మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఈ విషయంలో చిరంజీవి, వెంకటేశ్ నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. వారి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో నా పని మరింత సులభమైంది. ఆ ఇద్దరూ కలిసి చేసిన 18 రోజుల చిత్రీకరణ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇద్దరూ 20 నిమిషాలపాటు తెరపై కనిపిస్తారు. వెంకటేశ్ కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే బిజినెస్ మ్యాన్ పాత్రలో కనిపిస్తారు. మనం నిజాయతీగా ఒకటి కోరుకున్నప్పుడు, అందులోని ఉద్దేశం అవతలివాళ్లకు అర్థమైనప్పుడు అన్నీ అనుకూలంగా జరుగుతాయని నేను నమ్ముతా. కథానాయిక నయనతార విషయంలోనూ అదే జరిగింది. ఆమె చాలా నిజాయతీగా ఉంటారు. ఒక విషయాన్ని బలంగా నమ్మారంటే కచ్చితంగా చేస్తారు. ఆమె అడగ్గానే ప్రమోషనల్ వీడియోలు చేశారు’’.


