ఇందిరమ్మ ఇండ్లల్లో గందరగోళం-Namasthe Telangana


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల టవర్ల పేరిట గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. పథకం ప్రకటించినప్పటి నుంచి ఇండ్ల కేటాయింపు దాకా దరఖాస్తుదారులను అయోమయానికి గురిచేస్తున్నది. కుంటి సాకులు చూపుతూ దరఖాస్తుదారులను అనర్హులుగా తేల్చడం నుంచి ఇల్లు కేటాయింపు దాకా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. 16 నియోజకవర్గాల్లో 16 చోట్ల ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.


ఇందిరమ్మ ఇండ్లల్లో గందరగోళం
  • తుది జాబితా విడుదల చేయకుండానే ప్రారంభోత్సవాలు
  • అర్హుల జాబితాలో పేర్లు.. అలాట్‌మెంట్‌ లిస్టులో గల్లంతు
  • అడ్రెస్‌, నియోజకవర్గం మార్పు పేరిట భారీగా తొలగింపు
  • తొందరగా పూర్తిచేయాలనే ఒత్తిడిలో అధికారుల తప్పిదాలు
  • ప్రభుత్వం, హౌసింగ్‌ బోర్డు తీరుతో నష్టపోతున్న అర్హులు

సిటీ బ్యూరో, సెప్టెంబర్‌ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల టవర్ల పేరిట గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. పథకం ప్రకటించినప్పటి నుంచి ఇండ్ల కేటాయింపు దాకా దరఖాస్తుదారులను అయోమయానికి గురిచేస్తున్నది. కుంటి సాకులు చూపుతూ దరఖాస్తుదారులను అనర్హులుగా తేల్చడం నుంచి ఇల్లు కేటాయింపు దాకా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. 16 నియోజకవర్గాల్లో 16 చోట్ల ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

అర్హుల తుది జాబితా విడుదల చేయకుండానే లాటరీలు తీసి లబ్ధిదారులను ప్రకటించారు. వారికి ఒక నంబర్‌ కూడా కేటాయించారు. అయినా కొంతమంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యల వల్ల మీకు ఇల్లు కేటాయించినట్లు వచ్చిందని.. మీరు అర్హులు కాకున్నా టెక్నికల్‌ ఎర్రర్‌ వల్ల మీ పేరును లాటరీలో చేర్చామని కప్పిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ పేరిట ఒక నియోజకవర్గంలో ఉండి మరో నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్నారంటూ సగం మందిని అర్హుల జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక ఒక్కో టవర్‌కు అర్హులను పూర్తిస్థాయిలో ఎంపిక చేయకుండానే ప్రారంభోత్సవాలు మొదలు పెట్టేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించినప్పటి నుంచి ఏ దశలోనూ పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించడంలేదు. దీంతో అసలైన అర్హులకు ఇందరిమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారా? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వ ఒత్తిడితో అధికారుల సతమతం

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రారంభోత్సవాల దాకా ప్రభుత్వం అధికారులను పూర్తిస్థాయిలో పనిచేయనీయడం లేదు. దరఖాస్తుల పరిశీలన, అర్హుల గుర్తింపుతో పాటు .. లబ్ధిదారుల ఎంపిక దాకా ఆగమేఘాల మీద చేపడుతున్నారు. అధికారులకు తగినంత సమయం ఇవ్వకపోవడంతో ప్రతి దశలోనూ తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అసలైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందని ద్రాక్షగా మిగులుతున్నాయి. కనీసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకముందే ప్రారంభోత్సవాలు చేపడుతుండటంతో లాటరీలో పేర్లు వచ్చినవారు తమకు ఇండ్లు వస్తాయో రావోననే ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా ప్రతి దశలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో అధికారులు రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తున్నది.

ఇప్పటికే హౌసింగ్‌ బోర్డులో తగినంత సిబ్బంది లేరు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని హౌసింగ్‌ బోర్డుకు అప్పగించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఉన్నవారితో 16 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ఎలా సాధ్యమవుతుందనే అంచనా వేయలేదు. దీంతో తక్కువ సిబ్బంది, తక్కువ సమయంలో ఎంపికలు పూర్తి చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో టెక్నికల్‌గా సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఒకరి బదులు మరొకరి పేర్లు లాటరీలో తీయడం, అసలైన వారిని పక్కకు పెట్టడం వంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES



Source link

Scroll to Top