వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మార్పులు
ఉమ్మడి జిల్లాకు రూ.18 కోట్ల వరకు కేటాయింపులు
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం

రాయితీపై అందజేయనున్న డ్రోన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో రాయితీ పోగా మిగిలిన మొత్తాన్ని రైతులు డీడీ రూపంలో చెల్లిస్తే పరికరాలు అందజేసేవారు. రాయితీ నిధులను సంబంధిత కంపెనీకి ప్రభుత్వం చెల్లించేది. ఈ సీజన్ నుంచి రైతులు పథకానికి దరఖాస్తు చేసుకొన్నాక మంజూరైన యంత్ర పరికరాలను పూర్తి ధర చెల్లించి ప్రభుత్వం సూచించిన కంపెనీలవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తదుపరి ప్రభుత్వం రాయితీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాకు రూ.18 కోట్ల వరకు నిధులు కేటాయించనున్నారు.
అధిక ధర.. ఆలస్యం.. అనాసక్తి
- గతంలో నాలుగు జిల్లాలకు కలిపి ఏడాదికి రూ.150 కోట్లకు పైగా విలువైన హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను రాయితీపై ఇచ్చేవారు.
- 2025-26లో కేవలం రూ.10.43 కోట్లు కేటాయించగా రూ.8.38 కోట్ల రాయితీని మాత్రమే విడుదల చేశారు. 13,140 యూనిట్ల లక్ష్యానికి 1,680 మాత్రమే అందజేశారు.
- ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీ ఉండగా రూ.లక్షలోపు ధర కలిగిన వాటికి మండల కమిటీ, రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఎంపిక చేయాలి.
- వేల సంఖ్యలో రైతులు పథకానికి దరఖాస్తు చేసినా మండల, జిల్లా కమిటీలు సకాలంలో లబ్ధిదారులను ఎంపిక చేయక అతి కొద్ది మందికి మాత్రమే రాయితీ పరికరాలు అందాయి.
- మరోవైపు ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసిన పరికరాల ధరలకు బయటి మార్కెట్ ధరలకు మధ్య తేడా స్వల్పంగానే ఉండటంతో దరఖాస్తు ప్రక్రియ, మంజూరులో ఆలస్యం వంటి కారణాలతో చాలా మంది రైతులు ఆసక్తి చూపలేదు.
యాసంగి నాటికైనా అందేనా!
ఉమ్మడి జిల్లాలో మొత్తం పట్టాదారులు 7.52 లక్షల మంది ఉండగా అందులో 85 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వీరు ముందస్తుగా దరఖాస్తు చేసి యంత్రాలను మంజూరు చేయించుకోవడం, పూర్తి ధర వెచ్చించి కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారనుంది. ఈ ఏడాది పిచికారీ యంత్రాలు, డ్రోన్లు, గడ్డి కట్టలు కట్టే, చదును చేసే తదితర 36 రకాల యంత్ర పరికరాలను రాయితీపై ఇవ్వనున్నారు. కనీసం ఈ సంవత్సరమైనా ఉమ్మడి జిల్లాకు రాయితీ మొత్తాన్ని రూ.50 కోట్ల వరకు పెంచితేనే ఎక్కువ మందికి లబ్ధి కలగనుంది. యూనిట్ల సంఖ్యను పెంచి బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరకు ఇవ్వాలని, ఇప్పటికే వానాకాలం సాగుకు సమయం దాటినందున పంటలు విత్తుకునే అదను దాటిపోగా కనీసం యాసంగి సాగు వరకైనా అదనులో యంత్ర పరికరాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.


