Udaya Bhanu: నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు..: ఉదయభాను భావోద్వేగం


ఇంటర్నెట్‌ డెస్క్: ఇప్పటి వరకూ వ్యాఖ్యాతగా, నటిగా మెప్పించిన ఉదయభాను మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ (Panchanama) సిరీస్‌ను రూపొందించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5 (ZEE 5) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

ఎమోషనల్‌ కాకూడదని ఈవెంట్‌కు వచ్చాను. కానీ, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానంటూ ఉదయభాను (Udaya Bhanu) మాట్లాడారు. ‘‘నిర్మాతగా మారాలని దాదాపు 15 ఏళ్లుగా నేను తపస్సు చేస్తున్నాను. నా ప్రయాణం టెలివిజన్‌లోనే ప్రారంభమైంది. ఇక్కడే ఉదయభాను అందరికీ హృదయభానుగా మారింది. అందుకే టెలివిజన్‌తోనే నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నా. 15 ఏళ్లు ఎన్నో ప్రయత్నాలు చేశాను. మంచి కంటెంట్‌ ఉందని చాలా మందిని కలిసినా పని కాలేదు. వచ్చే నెల.. వచ్చే వారం ప్రారంభం చేద్దాం అని 15 ఏళ్లు గడిచాయి. ఎందుకు ఇన్నేళ్లు ఆలస్యమైందనేది నాకు కూడా తెలియని ప్రశ్నే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగా రెండు గంటలు కూడా నిద్రపోలేదు’’ అని అన్నారు.

ఇక ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చానన్నారు ఉదయభాను. 12 ఏళ్ల వయసులో మైక్‌ పట్టుకుని స్వయంకృషితో ఒక్కో విషయం నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చానన్నారు. ‘‘నాకు స్టూడియోలు లేవు. నేనేం పెద్ద స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు. కష్టపడి ఎదిగాను. ఈ రోజు నేను ఈ ఈవెంట్‌కు రావాలని ఏ అగ్రహీరోను ఆహ్వానించినా వచ్చేవాళ్లు. కానీ, నాకు అసలైన సపోర్ట్‌ ఆడియన్స్‌ .. మీ మధ్యే నా జీవితం గడిచింది. ఎన్ని సార్లు కిందపడ్డానో.. అన్నిసార్లు ధైర్యంతో ముందుకు సాగాను. కిందపడినప్పుడల్లా రెట్టింపు ఉత్సాహంతో నిల్చున్నాను. ఇప్పుడు పరిగెత్తడం నేర్చుకున్నాను. టాలెంట్‌ ఉంటే ఉదయభాను  ప్రొడక్షన్స్‌ డోర్‌ ఎప్పుడూ తెరిచే ఉంటుంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సిరీస్‌ కోసం కొంతమంది హీరోలను సంప్రదిస్తే.. ఏకంగా సిరీస్‌ మొత్తానికి అయ్యే బడ్జెట్‌ను రెమ్యునరేషన్‌గా అడిగారని ఆమె తెలిపారు. భరత్ నివాస్ ప్రధానపాత్రలో నటించిన ‘పంచనామా’కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.



Source link

Scroll to Top