హోంవర్క్ చేయలేదని చిన్నారికి టీచర్ మందలింపు
చొక్కా గుండీలు తీసి.. చెంపపై కొట్టిన ఉపాధ్యాయురాలు
తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన ఆరేళ్ల బాలుడు
విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన

కేజీహెచ్ శవాగారం వద్ద రోదిస్తున్న బాలుడి తల్లిదండ్రులు
ఈనాడు, విశాఖపట్నం, అమరావతి, న్యూస్‌టుడే-జగదాంబకూడలి: హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించడంతో.. తీవ్రంగా భయపడిన ఆరేళ్ల బాలుడి ఊపిరాగిపోయింది. టీచర్ కోప్పడతారన్న భయంతో ఆ చిన్నారి అప్పటికే గజగజలాడుతుండగా.. టీచర్ పలక లాక్కొని.. టై, బెల్టు తీసి, చొక్కా గుండీలు విప్పి, చెంపపై కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం.. విశాఖలోని టౌన్కొత్తరోడ్డుకు చెందిన తమ్మన కృష్ణప్రసాద్ క్యాటరింగ్ పనులు చేస్తుంటారు., ఆయనకు భార్య సాయిలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు ప్రణయ్‌తేజ్ (6) టౌన్‌కొత్తరోడ్డులోని వారి ఇంటికి సమీపంలోని లిటిల్ గార్డెన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు.
ఆ దెబ్బతో.. కుప్పకూలిపోయి..
పాఠశాలలో గురువారం ఉదయం ఉపాధ్యాయురాలు పిల్లలకు ఇచ్చిన హోంవర్క్‌లను పరిశీలిస్తున్నారు. అప్పటికే ప్రణయ్‌తేజ్ తాను హోంవర్క్ చేయలేదన్న ఆందోళనలో ఉన్నాడు. ఇంతలో టీచర్ అడగడంతో భయపడుతూ వెళ్లగా, ఆమె పలక లాగేసుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు బాబును మందలించారు. దగ్గరకు రమ్మని పిలిచి కోప్పడ్డారు. దగ్గరకు లాగి.. టై, బెల్టు వదులు చేసి, చొక్కా గుండీలు విప్పి, చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే ముందుకు వాలిపోతూ టీచర్ ఒడిలో కుప్పకూలిపోయాడు. ఆమె బాలుడిని నిలబెట్టే ప్రయత్నం చేసినా లేవలేదు. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది సహకారంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడి నుంచి పాఠశాల సిబ్బంది కేజీహెచ్‌కు తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి, బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.
తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు..
కేజీహెచ్‌లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వారం కిందట బాలుడి కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. తిరుపతి, హైదరాబాద్‌లలో పర్యటించి రెండు రోజుల కిందటే ఇంటికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రణయ్ బడికి బయలుదేరుతుండగా తండ్రి ఇంట్లో ఉండాలని సూచించారు. కచ్చితంగా వెళ్లాలని, హోంవర్క్ ఉందని చెప్పిన బాలుడు పాఠశాలకు వెళ్లాడు. ఆ విషయాలను గుర్తుచేసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతికి కారణమైన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి శవాగారం వద్ద విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, డీఈవో ప్రేమకుమార్‌లు వెల్లడించారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధ్యులపై చట్టప్రకారం చర్యలు
-మంత్రి లోకేశ్
ప్రణయ్‌తేజ్ మృతిపై మంత్రి లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో తెలిపారు. ప్రభుత్వం బాలుడి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనపై విచారణకు విద్యాశాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. విశాఖపట్నం జేడీ, డీఈవో, ఆర్డీవో ఇందులో ఉన్నారు.


