యూపీఐ సేవలపై ఛార్జీలుండవ్‌ | general


స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇండర్‌ఫేస్‌) లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టత ఇచ్చింది. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితమేనని ప్రభుత్వం తెలిపింది. వ్యక్తుల మధ్య లావాదేవీలు కూడా పూర్తి ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ‘పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం 2007లో మార్పులు చేసేందుకు తీసుకొచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. యూపీఐతో పాటు ప్రభుత్వం గుర్తించే ఇతర ఎలక్ట్రానిక్‌ చెల్లింపు విధానాలపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఈ సవరణలో ఉంది. ఫలితంగా యూపీఐ సేవలపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన మొదలైన నేపథ్యంలో’ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది. 

భవిష్యత్తులో ఛార్జీలు ప్రవేశపెట్టినా, కొంతమంది వ్యాపారుల నుంచి మాత్రమే నామమాత్రపు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) వసూలు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. నిర్దిష్ట పరిమితికి మించి జరిగే కొద్దిపాటి వ్యాపార లావాదేవీలకే,  చాలా తక్కువ రేటు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. డెబిట్‌కార్డు/క్రెడిట్‌ కార్డుల ఎండీఆర్‌ కంటే ఇవి చాలా తక్కువగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

ఇప్పుడే కాదు.. 

ట్యాక్సేషన్‌ అండ్‌ అదర్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్, 2026ను పార్లమెంట్‌ ఆమోదించాకే, పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 10ఎ లో మార్పులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఛార్జీలు అవసరమా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. ఒకవేళ రుసుము వేయాలంటే ఎంత అనేది ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోని ‘యూపీఐ అండ్‌ సర్వీసెస్‌ స్టీరింగ్‌ కమిటీ’ నిర్ణయిస్తుందని పేర్కొంది. 

సేవలు సురక్షితంగా నిర్వహించేందుకే..

యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక సదుపాయాలపై నిరంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి, యూపీఐ తదుపరి దశను అభివృద్ధి చేయలేమని పేర్కొంది. స్వయంసిద్ధంగా ఈ వ్యవస్థ మనగలగాలని, మరింత సురక్షితంగా – సౌకర్యవంతంగా లావాదేవీలు నిర్వహించేలా అభివృద్ధి చేసేందుకే చట్టంలో స్వల్ప మార్పులు చేసినట్లు వివరించింది. మనదేశమే అభివృద్ధి చేసిన యూపీఐ విధానంలో ,విదేశీ ఒత్తిళ్ల కారణంగానే మార్పులు చేస్తున్నారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. అలాంటి వాదనలు నిరాధారమైనవని స్పష్టం చేసింది.



Source link

Scroll to Top