KC Venugopal: ‘సర్‌’పై అధిష్ఠానం సీరియస్‌


పేదల ఓట్లు తొలగించకుండా చూడాలి 

పీసీసీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదేశం 

భవిష్యత్‌ కార్యాచరణపై మీనాక్షి నటరాజన్‌తో సమీక్షించాలని నిర్దేశం 

దిల్లీలో కేసీ వేణుగోపాల్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో ఆగస్టు 3వరకు జరిగే సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సానుభూతిపరులు, పేదలు, బడుగు, బలహీనవర్గాల ఓట్లు పోకుండా జాగ్రత్తపడాలని నిర్దేశించారు. దీనిపై ఇప్పటివరకు చేసిన కసరత్తులో వచ్చిన ఫలితాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను బేరీజు వేసుకొని తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు పార్టీ-ప్రభుత్వం మధ్య ఏర్పాటైన సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో బుధవారం సమావేశం కావాలని ఆదేశించారు. ఆయన సోమవారం సాయంత్రం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్, వంశీచంద్‌రెడ్డి తదితరులతో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై సమీక్షించిన సందర్భంగా సర్‌పై ప్రత్యేకంగా మాట్లాడారు. 

పార్టీ ఓటర్లను కాపాడటంలో నాయకులు విఫలమైతే ఏ హోదాలో ఉన్నవారిపైనైనా తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి వరకు అందరూ ఓట్లు కాపాడుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్దేశించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఈ కార్యక్రమాన్ని సరిగ్గా పర్యవేక్షించలేదని, తెలంగాణలో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆ బాధ్యత పూర్తిగా సమన్వయ కమిటీ సభ్యులదేనని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన డీసీసీ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు పనిచేయడంలో వెనుకబడి ఉంటే వారి పనితీరును సీరియస్‌గా సమీక్షించాలని చెప్పారు. వారికి మార్గనిర్దేశం చేయాలని, అప్పటికీ పనితీరులో మార్పు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. జులై 8తో ముగిసిన నామినేషన్‌ పోస్టుల భర్తీ అయినా, ఇంకేదైనా కార్యక్రమమైనా సర్‌ పూర్తయిన తర్వాతే చూద్దామని స్పష్టం చేశారు. 


రేపు సమన్వయకమిటీ సమావేశం

-పీసీసీ అధ్యక్షుడు 

దిల్లీలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాతో భేటీ అయిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

కేసీ వేణుగోపాల్‌తో సమావేశం ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్‌ జరుగుతున్న తీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ బుధవారం పూర్తి స్థాయిలో సమీక్షించనున్నట్లు వెల్లడించారు. బీఎల్‌ఏలు ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందకుండా సర్‌ జరిగిన తీరుపై లోతుగా సమీక్షించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి నిర్దేశించినట్లు చెప్పారు. బుధవారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమీక్ష కార్యక్రమంలో పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఏర్పడిన సమన్వయకమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్, దామోదర్‌ రాజనర్సింహ, సీతక్క, పార్టీ నాయకుడు వంశీచంద్‌రెడ్డితో పాటు తాను పాల్గొననున్నట్లు ప్రకటించారు. పేదలెవరూ ఓటు హక్కు కోల్పోకూడదన్నదే పార్టీ నిర్ణయమని, కింది స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్ల తొలగింపును అడ్డుకోవడం కాంగ్రెస్‌ బాధ్యత కాబట్టి సర్‌పై చర్చించబోతున్నట్లు చెప్పారు. దీనికోసం బుధవారం వరకూ ముఖ్యమంత్రి, తానూ దిల్లీలోనే ఉంటున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో కేసీ వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలోని ఇతర విషయాలనూ చెప్పారు. ‘‘కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకమైన తర్వాత పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏఐసీసీ అప్పగించిన అన్ని కార్యక్రమాలనూ పీసీసీ బాగా చేసిందని కేసీ వేణుగోపాల్‌ ప్రశంసించారు. సంస్థాగతంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు… ఆ ఉత్తర్వులను తాను పూర్తిగా చూడలేదన్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సామేలు బహిరంగ విమర్శలు చేసుకోవడంపై తర్వాత మాట్లాడతానన్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నందున.. రాష్ట్ర మంత్రివర్గంలోకి యువతను తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు తాము యువతకు కూడా ప్రాధాన్యమిస్తామని బదులిచ్చారు. ఈ సమావేశం తర్వాత ఆయన దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఇక్కడి తెలంగాణభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, జేపీ నడ్డాలను కలవనున్నట్లు సమాచారం. 



Source link

Scroll to Top