Uday Krishna Reddy: పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి


హైదరాబాద్‌: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని (uday krishna reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ శివారులో కస్టడీలోకి తీసుకొని అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్‌ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు.. వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

విచారణలో భాగంగా నిందితుడు పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులకు అతడి ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

గొంతు నులిమిన ఆనవాళ్లు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నమోదైన రోజు (జులై 18న) బాధితురాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. బాధితురాలి చెంప భాగంలో కమిలిన గాయాలను వైద్యులు గుర్తించారు. ఎడమ కాలిపైనా గాయం ఉంది. తాజాగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, బుధవారం ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు హాజరుపరచనున్నారు.



Source link

Scroll to Top