ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట


హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు (TG High Court)లో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 9లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. మంగళవారం వరకు స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.

‘‘ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు. మీరు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల నుంచి యాజమాన్యాలు వసూలు చేయొద్దంటే కళాశాలను వారు ఎలా నడుపుతారు? రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు?పెండింగ్‌ బకాయిలు ఎప్పటిలోపు చెల్లిస్తారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఆగస్ట్‌ 15లోపు బకాయిలు చెల్లిస్తామని బదులిచ్చారు. అలా జరిగితే తమ పిటిషన్లు కూడా వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్‌ కళాశాలల తరఫు న్యాయవాది చెప్పారు. 

ఇదే అంశంలో విద్యార్థులు కూడా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యార్థుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అటు ప్రభుత్వం, ఇటు కళాశాలల యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారన్నారు. ఈ బకాయిలతో విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోర్టును కోరారు. మంగళవారం అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.



Source link

Scroll to Top