
ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డేలో భారత్ చేతిలో ఓటమి ఎదురైనా సరే.. అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102: 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) మాత్రం ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా గుర్బాజ్ మాత్రం దూకుడుగా ఆడాడు. తన ఇన్నింగ్స్ వెనుక టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలు ప్రభావం చూపించాయని గుర్బాజ్ వెల్లడించాడు. టెస్టు మ్యాచ్ తర్వాత గంభీర్‌తో సంభాషించినట్లు తెలిపాడు.
‘‘ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడినందుకు సంతోషంగా ఉంది. కానీ, మా జట్టు ఓడిపోవడంతో నిరాశకు గురయ్యా. వ్యక్తిగతంగా నా ఆటతీరు మెరుగైంది. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించా. అయితే, ఈ ఇన్నింగ్స్‌కు క్రెడిట్ మాత్రం గౌతమ్ గంభీర్‌కే దక్కుతుంది. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనతో చాలా సమయం మాట్లాడా. అది నాకు చాలా సాయం చేసింది. షాట్ల ఎంపికలో ఎలా మెరుగు కావాలని ఆయన్ను అడిగా. చక్కటి సూచనలు ఇచ్చాడు. నెట్స్‌లో అదే ప్రాక్టీస్ చేశా. ఇప్పుడు ఫలితం వచ్చింది. అందుకే, గంభీర్ సర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా. పిచ్ చాలా క్లిష్టంగా ఉంది. స్పిన్‌ను ఆడటం తేలికైన విషయం కాదు. స్పిన్నర్లకు కాస్త టర్న్తోపాటు సహకారం లభించింది. నేను మాత్రం పాజిటివ్‌గా ఆడా’’ అని గుర్బాజ్ తెలిపాడు.
గుర్బాజ్ సూపర్ రికార్డు
అఫ్గానిస్థాన్ తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్బాజ్ రికార్డు సృష్టించాడు. భారత్‌పై 48 బంతుల్లోనే మైలురాయిని చేరాడు. ఇంతకుముందు మహ్మద్ షాజాద్ (72 బంతుల్లో) పేరిట ఘనత ఉండేది.


