జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఇటీవల పెట్టిన పోస్ట్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. నాయకుడికి అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనం అని నాగబాబు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. “లీడర్ మాటే శిరోధార్యం. ఆయన మార్గంలో ఉన్న దుష్టశక్తులను ఎవరూ చూడలేదు. ఏది సరైనదో, ఏది కాదో ఆయనకు మాత్రమే తెలుసు. మీ సందేహాలను పక్కనపెట్టి, మౌనం వహించి, ఎటువంటి ప్రశ్నలూ వేయకుండా నాయకుడిని అనుసరించండి” అని నాగబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడు అంటూ ఆయన ఫోటోని పోస్ట్ చేశారు. నాగబాబు ట్వీట్ పై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.
“మీ సందేహాలను పక్కనపెట్టండి, నోరు మూసుకొని ప్రశ్నలు వేయకుండా మౌనంగా నాయకుడిని అనుసరించండి” అని అనడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?. మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయిందా?” అని ప్రకాష్ రాజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు.
“అసలు మీ ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మిన ప్రజలు ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారు.. అతనికేమీ రాజుగా పట్టాభిషేకం చేయలేదు” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్జీవీ చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.



