Fact check: ‘బంగారాన్ని ఆర్‌బీఐ విక్రయించలేదు’.. బ్లూమ్‌బెర్గ్‌ నివేదికను ఖండించిన కేంద్రం


Fact check | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెద్దఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఫారెక్స్‌ నిల్వలు కాపాడుకోవడానికి ఆర్‌బీఐ పసిడిని విక్రయించిందంటూ వచ్చిన బ్లూమ్‌బర్గ్‌ కథనాన్ని తోసిపుచ్చింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.

పశ్చిమాసియా సంక్షోభం వల్ల మన ఇంధన దిగుమతుల బిల్లు భారీగా పెరిగింది. మన ఈక్విటీలను విదేశీ మదుపర్లు విక్రయించి, పెట్టుబడులు పట్టుకెళ్లిపోతున్నారు. ఈ కారణాల వల్ల అమెరికా డాలర్‌కు గిరాకీ బాగా పెరిగింది. ఫలితంగా రూపాయి విలువ తగ్గిపోతోంది. దీంతో మన విదేశీ మారకపు ద్రవ్యం (ఫారెక్స్‌) నిల్వలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కాపాడుకునేందుకు ఆర్‌బీఐ 12 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడిని విక్రయించినట్లు వార్తాసంస్థ బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఫారెక్స్‌ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92 శాతంగా ఉండగా.. 2026 మార్చి 31 నాటికి 16.70 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మే 22 నాటికి ఆ మొత్తం 16.85 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలను ఉదహరించింది. ఆర్‌బీఐ తన వద్ద ఫిజికల్‌ గోల్డ్‌ వివరాలను ఎప్పటికప్పుడు నెలవారీ బులెటిన్‌లో వెల్లడిస్తోందని పేర్కొంది. ఈ తేదీ వరకు అందులో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కాబట్టి తప్పుడు సమాచారం నమ్మొద్దని సూచించింది. అధికారిక సమాచారం కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.



Source link

Scroll to Top