
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్లకే హేమాహేమీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం అతడే టాప్ స్కోరర్. మొత్తం 72 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో అతడిని టీమ్ఇండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లూ పెరిగాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కూడా వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే, ఈ కుర్రాడిని టెస్టుల్లోనూ చూడాలని ఉందని తన మనసులోని మాట చెప్పాడు. వైభవ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు.
‘‘అందరూ వైభవ్ గురించి మాట్లాడుతున్నారు. నేను అతడి బ్యాటింగ్‌ను చూశా. అద్భుతంగా ఉంది. నిజంగా అతడొక స్పెషల్ ప్లేయర్. కేవలం బంతిని బాదే సామర్థ్యం చూసి చెప్పడం లేదు. అతడు రిస్ట్‌ను వాడే విధానం చాలా బాగుంది. మైదానం నలువైపులా షాట్లు కొట్టాలంటే ఆటగాడి మణికట్టు పనితీరు బాగుండాలి. ఈ విషయంలో వైభవ్ సూపర్. ఈ సీజన్లో అతడు బంతిని కేవలం బాదేయడమే కాదు.. మిగతా బ్యాటర్ల కంటే అద్భుతంగా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను పసిగట్టి అలవోకగా షాట్లు కొట్టేశాడు. వైభవ్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వడం బాగుంది. నేనూ అతడికి అదే సలహా ఇచ్చా. సహజసిద్ధంగా ఆడేందుకు ప్రయత్నించమన్నా’’ అని సచిన్ తెలిపాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఆడితే…
‘‘ప్రతి అంశానికీ తొలిసారి అనేది ఒకటే ఉంటుంది. టెస్టు క్రికెట్లో వివిధ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. వయసు పెరిగే కొద్దీ పరిష్కారం ఆధారిత ఆలోచనా విధానం కలిగి ఉండటం ముఖ్యం. కెరీర్లో తొలి బంతిని ఎదుర్కొనేటప్పటి నుంచి చివరి బాల్ ఆడే వరకూ సమస్యలు ఉంటాయి. ప్రత్యర్థి బౌలర్ మనకు సవాళ్లు విసురుతూనే ఉంటాడు. దానికి సరైన సమాధానం బ్యాట్‌తోనే ఇవ్వాలి. నాతోపాటు చాలా మంది క్రికెట్ అభిమానులు వైభవ్ సూర్యవంశీని టెస్టుల్లోనూ చూడాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఆ అవకాశం వస్తుందో చెప్పలేం. కానీ, అతడికి నిరంతరం ప్రోత్సాహం అందించాలి. అంతేకానీ, వైభవ్ ఇది ఆడాలి.. అలా ఆడాలి.. ఆ జట్టులోకి తీసుకోవాలి.. అని ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదు. ఆ బాధ్యతను సెలక్టర్లకు వదిలేయండి’’ అని సచిన్ స్పష్టం చేశాడు.


