‘ఎన్ఎంఈవో’లో భాగంగా ఐదేళ్లలో 98,112 హెక్టార్లలో సాగు
కేంద్ర ప్రభుత్వం వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ వంటనూనెల మిషన్ (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఎన్ఎంఈవో)లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పథకంలో భాగంగా 2021 నుంచి 2026 వరకు ఐదేళ్ల కాలానికి దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్ల(6,74,905 ఎకరాలు)లో సాగు జరగ్గా.. అందులో 98,112 హెక్టార్ల(2,42,440 ఎకరాల)తో తెలంగాణ ముందు నిలిచింది. 97,871 హెక్టార్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం పొందింది. దేశవ్యాప్త సాగు విస్తీర్ణంలో తెలంగాణ ఒక్కటే దాదాపు 36 శాతం వాటాను పొందింది. శుక్రవారం దిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు-2026లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యదర్శి అతీశ్చంద్ర ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రైతులను అభినందించారు. స్వయంసమృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ పథకాన్ని చేపట్టింది. తెలంగాణ, ఏపీ సహా 15 రాష్ట్రాలు ఇందులో చేరాయి. పథకం ప్రారంభం నుంచి తెలంగాణ ఏటా జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది.
దేశానికి గర్వకారణం: మంత్రి తుమ్మల
కేంద్ర పథకంలో తెలంగాణ అగ్రస్థానం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. రైతుల కృషి, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ విజయం సిద్ధించింది. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను ఆహ్వానిస్తూ ఆయిల్‌పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది.


