
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఓ బల్క్ క్యారియర్ నౌకపై దాడి జరిగింది. ఖతార్ (Qatar) రాజధాని దోహాకు సమీపంలో పెద్ద మొత్తంలో కంటైనర్లను మోసుకొస్తున్న నౌకపై గుర్తుతెలియని డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేసింది. ఈ క్రమంలోనే నౌకలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఆదివారం బ్రిటిష్ మిలిటరీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ప్రకారం.. ఖతార్ రాజధాని దోహాకు 23 నాటికల్ మైళ్ల దూరంలో ఓ నౌక సరకును తరలిస్తుండగా గుర్తుతెలియని ఆయుధం తాకడంతో నౌకలో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రాణనష్టం తప్పిందని యూకేఎంటీఓ వెల్లడించింది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ అమలవుతుండగా.. పర్షియన్ గల్ఫ్‌లో ఈ దాడి చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడికి గురైన నౌక ఏ దేశానికి చెందినది, అందులోని సరకు వివరాలు మాత్రం తెలియరాలేదు.


