
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో గుర్తు తెలియని దుండగులు అతి దగ్గరి నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆయనమీద కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారు. చంద్రనాథ్ సువేందుకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి. దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుల కోసం గాలిస్తున్నాయి. కాల్పులకు కారణాలు వెంటనే తెలియరాలేదు.

కోల్‌కతాలోని న్యూ మార్కెట్లో బుల్డోజర్తో కూల్చివేసిన మాంసం దుకాణాలు
– కోల్‌కతాలోని మార్కెట్లో మాంసం దుకాణాలను బుల్డోజర్లతో కొందరు దుండగులు తొలగించారు. ఇది భాజపా కార్యకర్తల పనేనని తృణమూల్ ఆరోపించింది. అయితే తృణమూల్ కార్యకర్తలే తమ పార్టీ జెండాలతో ఈ చర్యకు పాల్పడ్డారని భాజపా ఎదురు దాడి చేసింది.
– కోల్‌కతాలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న 80 మందిని అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నంద్ తెలిపారు.
– మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీయే నేతలు హాజరుకానున్నారు.
– ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా నిర్ణయించకపోయినా ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి ముందు వరుసలో ఉన్నారు.
– తృణమూల్ కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మమత నివాసంలో సమావేశమయ్యారు. భాజపా ఎన్నికలను లూటీ చేసిందని ఈ సందర్భంగా మమత ఆరోపించారు. దీనిపై పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లనుందని చెప్పారు.


