ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్‌ | Team India Cricketer ashok dinda Elected as MLA in West bengal


Team India Cricketer ashok dinda Elected as MLA in West bengal

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్‌ దిండా.

దిండా పూర్వ మిడ్నాపూర్‌ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్‌ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.

2021లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ (మనోజ్‌ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్‌ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.

42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్‌ అయిన దిండా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.

దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్‌ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 420 వికెట్లు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 151 వికెట్లు పడగొట్టాడు. 



Source link

Scroll to Top