
నర్సంపేట గ్రామీణం: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులతో కలిసి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు పెద్దిని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. కార్మికుల ఆందోళనతో ముత్తోజిపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది.


