Thimmarajupalli TV Review || చిత్రం: తిమ్మరాజుపల్లి టీవీ; నటీనటులు: సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్‌కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లాతిష్ తదితరులు; సంగీతం: వంశీకాంత్ రేఖన; సినిమాటోగ్రఫీ: అక్షయ్‌రామ్; నిర్మాత: కిరణ్ అబ్బవరం; రచన, ఎడిటింగ్, దర్శకత్వం: వి.మునిరాజ్; విడుదల: 17-04-2026

వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడాయన కొత్త ప్రతిభను తెరకు పరిచయం చేస్తూ స్వయంగా నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి TV’. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ శుక్రవారం తెరపైకి వచ్చింది. మరి టీవీ చెప్పిన కథేంటి? సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది?
కథేంటంటే..
Thimmarajupalli TV story || టీవీలు అప్పుడప్పుడే ఊళ్లలోకి ప్రవేశిస్తున్న 90వ దశకం. తిమ్మరాజుపల్లి అనే పల్లెటూళ్లో జరిగే కథ ఇది. శివరాత్రి వచ్చిందంటే ఊరి వాళ్లంతా కలిసికట్టుగా చందాలేసుకుని పండగ ఘనంగా జరిపించడం.. ఆ సాయంత్రం అద్దెకి తెచ్చుకున్న టీవీలో కొత్త సినిమాలు చూసి ఆనందించడం పరిపాటి. అలాంటి ఊళ్లోకి తొలిసారి సొంతంగా ఓ టీవీ కొనుక్కుని తెచ్చుకుంటాడు రాజప్ప (ప్రదీప్ కొట్టె). ఎప్పుడైతే ఆ ఇంట్లోకి టీవీ వచ్చిందో.. అప్పటి నుంచి ఊరి వాళ్ల బుల్లితెర వినోదాలకు రాజప్ప ఇల్లు చిరునామాగా మారిపోతుంది. ఆ ఊళ్లో చిల్లర దొంగతనాలు చేస్తూ గడిపేసే సతీష్ (సాయితేజ్) కూడా టీవీ చూడటానికని వచ్చి.. రాజప్ప చెల్లి శారద (వేద జలంధర్)తో ప్రేమాయణం సాగిస్తుంటాడు. ఓసారి ఈ ప్రేమ విషయం రాజప్పకి తెలియడంతో పెద్ద గొడవ జరుగుతుంది. సతీష్‌ని తీవ్రంగా అవమానించడంతో.. ‘ఏ టీవీని చూసైతే విర్రవీగుతున్నావో దాన్ని లేకుండా చేస్తాన’ని సవాల్ విసురుతాడు. సరిగ్గా అదే రాత్రి రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం జరగడంతో ఆ నింద సతీష్‌పై పడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా ఆ టీవీని ఎవరెత్తుకెళ్లారు? తనపై నింద తప్పని నిరూపించుకునేందుకు సతీష్ ఏం చేశాడు? ఊరి పెద్దలిచ్చిన రెండు వారాల గడువు లోపల ఆ టీవీని.. అసలు దొంగల్ని తను కనిపెట్టాడా? లేదా? ఈక్రమంలో తనకెదురైన సవాళ్లేంటి? అన్నది మిగిలిన కథ.
ఎలా ఉందంటే..
Thimmarajupalli TV Review Telugu || ఇప్పుడు అరచేతిలోకి వినోదాలు వచ్చేశాక టీవీ ప్రాధాన్యం ఎవరికీ పెద్దగా తెలియట్లేదు కానీ.. 80-90ల తరానికి టీవీ అంటే ఓ ఎమోషన్. బుల్లితెరతో పెనవేసుకున్న అనుబంధాలు.. దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు బోలెడన్ని. ఈ ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ఆ జ్ఞాపకాల్ని.. ఆ అనుబంధాల్ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు మునిరాజ్. మలయాళ సినిమాల్లోలా చాలా సింపుల్ లైన్‌పై నడిచే చిత్రమిది.
ఈ కథ ప్రధానంగా ఓ టీవీ దొంగతనం చుట్టూ తిరుగుతుంటుంది. దాన్ని హీరో ఎలా చేధించాడు.. ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లేంటి? అన్నది ఆసక్తికరం. నిజానికి ఇలాంటి సింగిల్ లైన్ కథలతో ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టడం అంత తేలికేం కాదు. కథలో బలమైన డ్రామా పండినప్పుడే అది సాధ్యం. ఈ విషయంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ పాసైంది.
దర్శకుడు ఈ కథకి ఎలాంటి కమర్షియల్ హంగులు జోడించకుండా చాలా నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తిమ్మరాజుపల్లిని.. ఆ ఊరివాళ్ల మనస్తత్వాల్ని.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని పరిచయం చేస్తూ కథని ఆరంభించిన తీరు బాగుంటుంది. నాయకానాయికల ప్రేమకథ ఎప్పుడైతే రాజప్పకి తెలుస్తుందో.. అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక తన ఇంట్లో టీవీ దొంగతనానికి గురైనప్పటి నుంచి కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈక్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి.

టీవీని దొంగతనం చేసిందెవరు.. దాన్ని హీరో ఎలా కనిపెట్టాడు అనే అంశాలతో ద్వితీయార్ధం సాగుతుంది. ఈ క్రమంలో టీవీ దొంగ ఎవరై ఉంటారనే మిస్టరీని చివరి వరకు ప్రేక్షకుల ఊహలకి చిక్కకుండా దాచిపెట్టడంలో దర్శకుడు పైచేయి సాధించాడు. అయితే దీన్ని కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయాణాన్ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. అయితే ప్రధాన తారాగణం మధ్య నడిచే డ్రామా ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెట్టగలుగుతుంది. ఇక క్లైమాక్స్‌లో అన్ని చిక్కుముడుల్ని లాజికల్‌గా విప్పిన తీరు.. ఓ చిన్న ఎమోషన్‌తో సినిమాని ముగించిన విధానం ప్రేక్షకుల్ని సంతృప్తిగా థియేటర్ల నుంచి బయటకు పంపుతుంది.
ఎవరెలా చేశారంటే..
Thimmarajupalli TV movie cast || తెరపై కనిపించేదంతా కొత్త వాళ్లైనా ప్రేక్షకులకు అదెక్కడా ఇబ్బందిగా అనిపించదు. నాయకానాయికలతో పాటు తెరపై కనిపించే ప్రతి పాత్రా సహజమైన నటనతో గుర్తుండిపోతుంది. సతీష్‌గా సాయితేజ్.. శారదగా వేద, రాజప్పగా ప్రదీప్, ఊరి సర్పంచ్ రామ చంద్రయ్యగా అమ్మ రమేశ్.. ఇలా ప్రతి పాత్రా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఎల్లమ్మ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
దర్శకుడు తాను అనుకున్న కథని నిజాయితీగా చెప్పడంలో విజయం సాధించాడు. దీన్ని పూర్తిగా ఓ పల్లెటూరిలోనే చాలా సహజంగా తెరకెక్కించారు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా తొలి ప్రయత్నంలో చాలా తక్కువ బడ్జెట్‌లో ఆహ్లాదభరితమైన సినిమా చూపించగలిగారు. పాటలన్నీ కథలో భాగంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమాకి మంచి ఫీల్‌ని జోడించింది. విజువల్స్ ఆకర్షణగా నిలుస్తాయి.
- బలాలు
- + ప్రధాన తారగణం సహజమైన నటన
- + టీవీతో అల్లుకున్న కొన్ని జ్ఞాపకాలు
- + ద్వితీయార్ధం
- బలహీనతలు
- – ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
- – బలమైన సంఘర్షణ లోపించడం
- చివరిగా: జ్ఞాపకాల్ని గుర్తుచేసే.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


