చైనా ప్లాన్‌కు భారత్‌ చెక్‌! ఆ 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు.. | India Grants Official Recognition To 27 Locations In Arunachal In Response To China’s Moves


India Grants Official Recognition To 27 Locations In Arunachal In Response To China's Moves

చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందనగా భారత్‌ ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో గుర్తించింది. ఈ ప్రాంతాలను స్థానికులు, స్వదేశీయులలో అవగాహన పెంచేదిశగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జాంగ్నాన్‌’గా పేర్కొంటూ అక్కడి ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతోంది. ఈ చర్యలను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కేవలం పేర్లు మార్చడం ద్వారా భూభాగంపై హక్కులు మారవని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది.

అయితే, తాజాగా సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిన మ్యాప్‌ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలోని లాంగ్జు కూడా ఉంది. 1959లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు తొలి ప్రధాన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఎగువన ఉన్నటువంటి సుబన్సిరి జిల్లాలోని సమీప మాజా గ్రామాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.

అదేవిధంగా డ్జో లా (Dzo La), రిజా లా (Riza La), పుకుర్ లా (Pukur La) వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తైన పర్వత మార్గాలు ఉన్నాయి. 1962 భారత్-చైనా యుద్ధం ప్రారంభంలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన థాగ్ లా (Thag La) కూడా ఈ అధికారిక మ్యాప్‌లో భాగమే.

27 ప్రదేశాల జాబితా..

అలాగే, 1962 భారత్-చైనా యుద్ధంలో కీలక పాత్ర పోషించిన జస్వంత్ గఢ్, షేర్-ఎ-థాపా మెమోరియల్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు చాంగ్లాంగ్ జిల్లాలోని జైరాంపూర్‌ను కూడా ఈ జాబితాలో ఉంది. ఇది తూర్పు అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల భద్రతా దళాల కదలికలకు ముఖ్యమైన కేంద్రం.

అయితే, భారత భూభాగాలకు కల్పిత పేర్లు పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు ‘ఆధారరహిత కథనాలను సృష్టించే ప్రయత్నాలు’ మాత్రమేనని న్యూఢిల్లీ పేర్కొంది. ఇటువంటి చర్యలు వాస్తవ పరిస్థితులను ఎప్పటికీ మార్చలేవని స్పష్టం చేయడంతోపాటు ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చని భారత్‌ హెచ్చరించింది.

చైనా తొలిసారిగా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలు, 2021లో 15 ప్రాంతాలు, 2023లో మరో 11 ప్రాంతాలకు పేర్లు మార్చినట్లు ప్రకటించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమని భారత్‌ నిరంతరం స్పష్టం చేస్తోంది. అయితే, చైనా చేపట్టే పరిపాలనా లేదా మ్యాప్‌లకు సంబంధించిన చర్యలు భారతదేశ చట్టపరమైన, భౌగోళిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని ఈ సందర్భంగా పేర్కొంది.



Source link

Scroll to Top